– నుజ్ఞాన్’ తొలి బ్యాచ్‌లో 23 మంది ఇంజినీర్లకు శిక్షణ పూర్తి
– మూడు నెలల పాటు అణు సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ
– 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ లక్ష్యానికి నైపుణ్యవంతుల తయారీ
– శిక్షణ పూర్తి చేసిన వారికి సంయుక్త ధ్రువపత్రాల ప్రదానం
సంగారెడ్డి, నిలువుటద్దం ప్రతినిధి: దేశంలో విస్తరిస్తున్న అణుశక్తి రంగానికి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లను సిద్ధం చేసే దిశగా ఐఐటీ హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నిర్వహించిన ‘అనుజ్ఞాన్’ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తొలి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. మూడు నెలల పాటు పూర్తిస్థాయి వసతి సౌకర్యంతో నిర్వహించిన ఈ శిక్షణలో 23 మంది ఇంజినీర్లు, పరిశ్రమ నిపుణులు అణు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందారు.
ఆగస్టు 3న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రియాక్టర్ ఫిజిక్స్, అణు భద్రత, రేడియేషన్ రక్షణ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, నాణ్యతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనలపై శిక్షణ అందించారు. తరగతి గది బోధనతో పాటు ప్రయోగశాల పరీక్షలు, అణు విద్యుత్ కేంద్రాల సిమ్యులేటర్ శిక్షణ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించారు. బార్క్, ఎన్పీసీఐఎల్ సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వం కూడా అందించారు.
ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన ముగింపు వేడుకలకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చైర్మన్ ఘనశ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి అధ్యక్షత వహించారు. ప్రముఖ అణుశాస్త్రవేత్తలు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు డాక్టర్ చైతన్యమోయ్ గంగూలీ, డాక్టర్ చంద్రకాంత్ పితావా, బార్క్ మాజీ డైరెక్టర్ ఆర్.ఎస్. యాదవ్, అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ధీరజ్ పాండే, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ సీనియర్ అడ్వైజర్ షా నవాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 23 మందికి ఐఐటీ హైదరాబాద్, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ సంయుక్తంగా ధ్రువపత్రాలు అందజేశారు.
2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం పెరుగుతోందని ఘనశ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. అణుశక్తి రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేయడంలో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి అభిప్రాయపడ్డారు. తొలి బ్యాచ్ విజయవంతం కావడం దేశ అణుశక్తి రంగానికి ప్రత్యేక నిపుణుల బృందాన్ని అందించే దిశగా మంచి ప్రారంభమని క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ డైరెక్టర్, న్యూక్లియర్ విభాగం అధ్యక్షుడు కమోడోర్ ఆర్.డి. మానే తెలిపారు.
ఈ శిక్షణ ద్వారా అణుశక్తి విభాగం పరిధిలోని సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థలు, తయారీ రంగం, అణు సాంకేతిక సరఫరా సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను అభ్యర్థులు పొందారు. భవిష్యత్తులో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, మైక్రో రియాక్టర్ల వంటి ఆధునిక సాంకేతిక రంగాలపైనా శిక్షణను విస్తరించనున్నారు. తదుపరి బ్యాచ్ ప్రవేశాల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 
పరిశోధనల్లోనూ ఐఐటీ హైదరాబాద్ దూకుడు
2008లో స్థాపించబడిన ఐఐటీ హైదరాబాద్ విద్య, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్‌ల రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఎన్ఐఆర్ఎఫ్–2025 ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ఏడో స్థానం, ఇన్నోవేషన్‌లో ఆరో స్థానం సాధించింది. క్యూ.ఎస్. ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్–2027లో 588వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 355 మందికి పైగా అధ్యాపకులు, 6,110 మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థలో ఉన్నారు. రూ.1,880 కోట్లకు పైగా విలువైన పరిశోధన ప్రాజెక్టులు, 850కి పైగా పేటెంట్లు, 300కి పైగా స్టార్టప్‌లతో సాంకేతిక అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. అణుశక్తి, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరిశోధనలు కొనసాగిస్తోంది.








