వివిధ విభాగాల పనితీరు, నిర్వహణపై సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశం
సంగారెడ్డి, నిలువుటద్దం ప్రతినిధి,నవంబర్ 2:
సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ వార్షిక తనిఖీల్లో భాగంగా మల్టీజోన్–II ఐజీ షానవాజ్ ఖాసిం సోమవారం జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్ఐ స్టోర్, మోటార్ వెహికల్ సెక్షన్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌ల పనితీరు, నిర్వహణను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రక్షణ పరికరాలను విధుల్లో తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. వాహనాలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ సిద్ధంగా ఉంచాలని, జాగిలాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

అనంతరం డీఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. ముందస్తు సమాచార సేకరణతో నేరాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరు ప్రశంసనీయమని అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.
ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఆర్ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.








