జర్నలిస్టులకే గౌరవం ఇవ్వలేని నాయకత్వం.. ప్రజలకు ఏం న్యాయం చేస్తుంది?
బండి రమేష్ వైఖరిపై జర్నలిస్టుల ఆగ్రహం!
ప్రెస్‌మీట్‌కు పిలిచి గంటల తరబడి నిరీక్షణ.. ప్రశ్నిస్తే చులకన సమాధానాలా?
తన సామాజిక వర్గానికే ప్రాధాన్యతా? ఇతర వర్గాల పట్ల వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు!
కూకట్‌పల్లి, నిలువుటద్దం ప్రతినిధి:
పదవి వచ్చిందని పొగరు పెరగాలా? బాధ్యత పెరగాలా? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుల పట్లే గౌరవం చూపలేని నాయకత్వం ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందనే ప్రశ్నలు ఇప్పుడు కూకట్‌పల్లి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ వ్యవహారశైలిపై పలువురు జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పిలుపు ఒకరిది.. నిరీక్షణ జర్నలిస్టులదా?
ఇటీవల శనివారం ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం ఇవ్వడంతో వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లకు చెందిన జర్నలిస్టులు సమయానికి సమావేశ స్థలానికి చేరుకున్నారు. అయితే నిర్ణీత సమయానికి సమావేశం ప్రారంభం కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధుల సమయానికి విలువ ఇవ్వలేని తీరు ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరా?
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై విలేకరులు ప్రశ్నలు అడగగా, అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని చెబుతూనే జర్నలిస్టుల అర్హతపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మీడియా బాధ్యత. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి విలేకరులను చులకనగా చూడటం నాయకత్వ లక్షణమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
దీపావళి స్వీట్లలోనూ వివక్షేనా?
పండుగ సందర్భంగా జర్నలిస్టులను ఆహ్వానించి కొంతమందికి మాత్రమే స్వీట్ బాక్సులు అందించి, మిగతా వారిని విస్మరించారనే ఆరోపణలు మరో వివాదానికి తెరలేపాయి. జర్నలిస్టులందరినీ సమానంగా చూడాల్సిన సందర్భంలో కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గాల మధ్య సమానత్వం ఎక్కడ?
ఒక రాజకీయ నాయకుడు అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ బండి రమేష్ తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ, ఇతర సామాజిక వర్గాలను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వినిపించడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? నాయకత్వం ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారం శాశ్వతం కాదు.. ఆత్మగౌరవం ముఖ్యం!
రాజకీయ పదవులు తాత్కాలికం. కానీ ప్రజలతో, మీడియాతో ఏర్పడే సంబంధాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలను వ్యక్తిగత విమర్శలుగా భావించకుండా, ప్రజల గొంతుకగా గుర్తించి సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య నాయకుడి బాధ్యత. మీడియాను గౌరవించని నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందగలదనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికైనా మార్పు వస్తుందా?
బండి రమేష్ తన వ్యవహారశైలిపై ఆత్మపరిశీలన చేసుకొని అన్ని సామాజిక వర్గాలకు, అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులకు సమాన గౌరవం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఆరోపణలపై ఆయన స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.








