నేరేడు చెరువులో మట్టి గుంతలు గుర్తించక నీటిలోకి దిగిన విద్యార్థులు
విషాద ఘటనతో పెద్దకంజర్లలో విషాదఛాయలు
పటాన్చెరు , అద్దం న్యూస్ సెప్టెంబర్ 16:
వినాయక నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దకంజర్లలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు విద్యార్థులు నీటిలోకి దిగారు. చెరువులో మట్టి కోసం తీసిన గుంతలు ఉండటాన్ని గమనించకపోవడంతో లోతైన నీటిలోకి వెళ్లిన విద్యార్థులు ఈత రాక మునిగిపోయినట్లు సమాచారం. మృతులను నర్సింహరాజు, సుమంత్, గణేష్, ఉదయ్‌కిరణ్, శ్యామ్‌కుమార్, సిద్దార్థ్‌గా గుర్తించారు. వీరిలో సుమంత్, గణేష్ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్‌కిరణ్ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్‌కుమార్ డిప్లొమా మొదటి సంవత్సరం, సిద్దార్థ్ పదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా అధికారులు తెలిపారు. పటాన్‌చెరులోని ప్రాచీన్ గ్లోబల్ ఆస్పత్రిలో మృతదేహాలను ఉంచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలకు నివాళులర్పించారు. తోటి విద్యార్థులను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను గురువారం ఉదయం 10 గంటల్లోపు పూర్తి చేసి, అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు అంబులెన్సుల్లో తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం తన సొంత నిధులతో అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ కూడా ఆస్పత్రికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. శివనగర్ చౌరస్తా సమీపంలోని పెద్దకంజర్లలో శిరీష చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ మొదటి తరగతి నుంచి పాలిటెక్నిక్, బీటెక్ వరకు సుమారు 70 మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణంరాజు తన కుమార్తె శిరీష పేరు మీద ఈ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.






