రాజకీయ నేతల మడుగులు ఒత్తే జర్నలిజం సమాజానికి నిరుపయోగం
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
టి జే యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి
సంగారెడ్డి, అక్టోబర్ 8 నిలువుటద్దం ప్రతినిధి:
ప్రజల సంక్షేమం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం జర్నలిజం పనిచేయాలని, రాజకీయ నాయకుల మడుగులు ఒత్తే జర్నలిజం సమాజానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టిజే యూ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అన్నారు.
గురువారం జిన్నారంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నూతన మండల కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని టి జే యూ జిల్లా అధ్యక్షులు ఎం. గిరి, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బింగి స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వాల మనుగడలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, అయితే ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జర్నలిస్టు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన జర్నలిజం అవినీతి, అక్రమాలకు అండగా నిలవకూడదని అన్నారు. ఏ పూటకు ఆ గొడుగు పట్టే విధానాలకు, రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే సంఘాల ఒత్తిళ్లకు జర్నలిస్టులు దూరంగా ఉండాలని సూచించారు.
టి జే యూ జిల్లా అధ్యక్షులు ఎం. గిరి మాట్లాడుతూ.. ఒకప్పుడు జర్నలిస్టు వృత్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేదని, ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా విస్తరణతో జర్నలిజం విలువలు దెబ్బతింటున్నాయని అన్నారు. 1951లో ఏర్పడిన తొలి జర్నలిస్టు సంఘంగా టి జేయూ ప్రస్తావన ఉందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు కల్పించిన అధికారాన్ని రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాలకు వినియోగించకుండా ప్రజా ప్రయోజనాలకు పనిచేయాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో నాలుగో స్తంభంగా భావించే మీడియా స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందని పేర్కొన్నారు.
జనం కోసం జర్నలిజం పనిచేయాలి.. అవినీతి, అక్రమాలకు కాదు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే ధైర్యం కోల్పోయి, రాజకీయ నాయకుల మెప్పు కోసం పనిచేసే జర్నలిజం ప్రజలకు న్యాయం చేయలేదని గిరి పేర్కొన్నారు.
అనంతరం పటాన్చెరు–జిన్నారం మండల టి జే యూ అధ్యక్షుడిగా వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, సభ్యులుగా శేఖర్, పాషాలను నియమించారు.
ఈ కార్యక్రమంలో టి జే యూ ఉమ్మడి జిల్లా నాయకులు ఎల్లన్న, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పోచ గౌడ్, గజ్వేల్ టి జే యూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









