
నాగపూర్, అక్టోబర్ 9:
విశ్వకర్మ-విశ్వబ్రాహ్మణ సమాజ ఐక్యత, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత మరియు రాజకీయ గుర్తింపు లక్ష్యంగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు తలపెట్టిన “విశ్వకర్మ ఏక్తా యాత్ర” పాదయాత్ర గురువారం సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్ శివారు ప్రాంతానికి చేరుకుంది. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వ్యవస్థాపకులు విశ్వనాథుల పుష్పగిరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ యాత్రకు స్థానిక నాయకులు, సమాజ ప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ జోగులాంబ గద్వాల జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాడు రామయ్య ఆచారితో పాటు మూసాపేట నరేష్ ఆచారి, రాచాల రవీంద్ర ఆచారి, సత్యనారాయణ ఆచారి, కాసర్ల విద్యాసాగర్లను స్థానికులు సన్మానించారు.
నవంబర్ 29న ఢిల్లీలో భారీ శక్తి ప్రదర్శన
పాదయాత్రలో భాగంగా కంచుపాడు రామయ్య ఆచారి మాట్లాడుతూ, విశ్వకర్మ సమాజ ఐక్యతను, హక్కులను చాటిచెప్పేందుకు నవంబర్ 29న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ “విశ్వకర్మ శక్తి ప్రదర్శన” నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల విశ్వకర్మ సోదరులు, మహిళలు, యువత, వృత్తి నిపుణులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య డిమాండ్లు:
* రాజకీయ ప్రాతినిధ్యం: స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో విశ్వకర్మ సమాజానికి తగిన ప్రాతినిధ్యం మరియు రిజర్వేషన్లు కల్పించాలి.
* మహిళలకు ఆర్థిక భరోసా: విశ్వకర్మ మహిళల ఉపాధి కోసం రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందించే ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలి.
* చేతివృత్తిదారులకు పింఛన్: 50 సంవత్సరాలు దాటిన అర్హులైన చేతివృత్తిదారులకు నెలకు పింఛన్ సదుపాయం కల్పించి సామాజిక భద్రత అందించాలి.
* ఆధునిక సాంకేతికత, రుణ సదుపాయం: సంప్రదాయ వృత్తుల నిర్వహణకు అవసరమైన లైసెన్సుల ప్రక్రియను సరళీకరించి, యంత్రాల కొనుగోలుకు మినీ ఇండస్ట్రీస్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి.
దేశవ్యాప్తంగా విశ్వకర్మ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు రామయ్య ఆచారి తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చి, జాతీయ స్థాయిలో హక్కుల సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.









