16 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ పరిశుభ్రత పనుల పరిశీలన
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: రాగం నాగేందర్ యాదవ్.
శేరిలింగంపల్లి ,నిలువుటద్దం ప్రతినిధి :
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన 16 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు) పరిశుభ్రత పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. 

వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి స్వయంగా వెళ్లి పరిశుభ్రత పనుల పురోగతిని పరిశీలించిన కార్పొరేటర్, ట్యాంక్ నిర్వహణ, పరిశుభ్రతతో పాటు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
రాజీవ్ గృహకల్పలో పర్యటించిన సందర్భంగా స్థానిక నివాసితులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న రాగం నాగేందర్ యాదవ్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ప్రధాన రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, శ్రీకాంత్ దేవులపల్లి, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సుజాత, సౌజన్య, జయలక్ష్మి, కుమారి, సుధారాణి, కళ్యాణి, గౌసియా, లక్ష్మి, మహేందర్, ఎల్లేష్, మహేందర్ సింగ్, మహేష్, నాందేవ్, వరప్రసాద్‌తో పాటు రాజీవ్ గృహకల్ప కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.









