అక్రమ నిర్మాణాల మాఫియాపై ఆరోపణలు.. అధికారుల మౌనంపై స్థానికుల ఆవేదన,
బలహీన పునాదులపై భారీ భవంతులు.. అనుమతుల మాయలో ముడుపుల ఛాయ……?
శేరిలింగంపల్లి, నిలువుటద్దం ప్రతినిధి:
చట్టాల కొరడాకు కట్టడాలు వంగాల్సిందేనా..? నిబంధనల పుస్తకాన్ని మాఫియా చెదలు తింటోందా..? సైబరాబాద్ పరిధిలో కాసుల కక్కుర్తితో నిరుపేద కూలీలు, అమాయకుల ప్రాణాలను కాంక్రీట్ గోడల మధ్య పణంగా పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, మియాపూర్‌తో పాటు మాదాపూర్ ప్రాంతాల్లో దాదాపు వెయ్యికి పైగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయని స్థానికులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ అక్రమ నిర్మాణాల్లో సింహభాగం ‘అనకొండ’గా పేరొందిన ఓ బడా బ్రోకర్ దందా ద్వారా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నాలుగు అంతస్తుల భారం మోయగలిగేలా కూడా లేని బలహీన పునాదులపై ఏకంగా ఆరు, ఏడు, ఎనిమిది అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వారు పేర్కొంటున్నారు.
రూ.6 కోట్లతో హంగులు.. అర్హులకు అగచాట్లు!
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన యంత్రాంగం తమ కార్యాలయాల ఆధునికీకరణ కోసం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. శేరిలింగంపల్లి జోనల్, సర్కిల్ కార్యాలయాల ఆధునికీకరణ పేరుతో సుమారు రూ.6 కోట్ల వరకు ఖర్చు చేసి ఖరీదైన ఫర్నిచర్, ఫాల్సీలింగ్లు, ఏసీలు, రంగుల హంగులతో ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అదే నిధులతో ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించవచ్చని వారు అంటున్నారు. ప్రజాధనంతో భారీ జీతాలు తీసుకుంటున్న అధికారులు కార్యాలయాల్లో కొలువై ఉన్నప్పటికీ, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతుల మాయ.. ముడుపుల ఛాయ!?
అధికారులకు, ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు స్థలంలో రెండు, మూడు అంతస్తుల నివాస భవన నిర్మాణానికి సంబంధించిన సమస్యలు కనిపించకపోవడం పట్ల బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు.
ఒక్కో భవనం నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఫీజులు, జరిమానాలను ఎగవేస్తున్నారని, ఆ మొత్తాలు అధికారులు, బ్రోకర్ల మధ్య వాటాలుగా పంచుకుంటున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు వచ్చినా, కాలనీవాసులు లిఖితపూర్వకంగా, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేసినా టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
కూలినప్పుడు హడావుడి.. తిమింగలాలు సేఫ్!?
పునాదుల సామర్థ్యానికి మించి స్లాబులు వేయడం వల్ల భవనాలు బరువు మోయలేక కుప్పకూలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నానక్‌రాంగూడలో భవనం కూలి 11 మంది మృత్యువాత పడగా, అంజయ్యనగర్‌లో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజాగా గోపన్పల్లిలోనూ అక్రమ నిర్మాణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ భవనం కుంగిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిర్మాణం జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ కొరవడుతోందని, భవనం ఒరిగినప్పుడో, కూలినప్పుడో డీఆర్ఎఫ్, ఫైర్, జేసీబీలు, హైడ్రా, పోలీసులతో హడావుడి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అంజయ్యనగర్ ఘటనలో అసలు బాధ్యులైన టౌన్‌ప్లానింగ్ అధికారులపై సమగ్ర చర్యలు తీసుకోకుండా ఒక సెక్షన్ అధికారిపై చర్యలతో వ్యవహారాన్ని ముగించారన్న విమర్శలపైనా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
కమిషనర్ గారూ.. మీ నిఘా ఏదీ?
చిన్నపాటి పన్నుల వసూళ్లలో చూపే కచ్చితత్వం.. అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణలో ముందుండే హైడ్రా.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అక్రమ నిర్మాణాల వెనుక ఉన్న దళారీ వ్యవస్థపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.









