పటాన్చెరు, నిలువుటద్దం ప్రతినిధి:
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ పాండు అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ.. విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను, ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు. గత 25 ఏళ్లుగా గురుపూజోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత 25 ఏళ్లుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాల వినియోగం జటిల సమస్యగా మారిందన్నారు. పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘గురువులకు పాదాభివందనం’ పేరుతో తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి మంత్రముగ్ధులైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ స్వయంగా రూ.26 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.









