పటాన్‌చెరు, నిలువుటద్దం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్తంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న సి. బిందును ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. 2010 నుంచి విద్యాబోధనలో కొనసాగుతున్న బిందు, విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారిలో క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్నారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్ మాట్లాడుతూ.. భవిష్యత్ భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడమే తమ పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బిందు ఎంపిక కావడం పాఠశాలకు, ఉపాధ్యాయ బృందానికి గర్వకారణమన్నారు.

గురుపూజోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యాసంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.









