భక్తులకు తీర్థప్రసాదాలు, మహా అన్నసమారాధనలో సేవ..
కూకట్‌పల్లి, నిలువుటద్దం ప్రతినిధి:
కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో నిర్వహించిన వినాయక నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో జనసేన పార్టీ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మహా అన్నసమారాధన కార్యక్రమంలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి అన్నసమారాధనలో పాల్గొని, భక్తులకు స్వయంగా తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొని సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని ప్రతిబింబించేలా వినాయక నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను, భక్తులను అభినందించారు.భక్తి, ఆధ్యాత్మికతతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తుల భాగస్వామ్యంతో ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస గోవిందా, పవన్ కిషోర్, పులిగొల్ల శ్రీను, జి.వి. ప్రసాద్, హరి, కేశవరావు, ప్రసన్న అంజనేయులు తదితర స్థానిక నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుడి నామస్మరణలతో గాయత్రి నగర్ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.










